Telugu Badi

తెలుగు భారత దేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అధికార భాష. భారత రాజ్యాంగము గుర్తించిన ఇరువది నాలుగు భాషలలో, నాలుగు ప్రాచీన భాషలలో ఒక్కటియై, భారత దేశములోని అత్యధిక ప్రజలు మాట్లాడు రెండవ భాష గానూ, ప్రపంచమునందలి అత్యధిక జనులు మాట్లాడు పదమూడవ భాష గానూ గణుతికెక్కింది. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము/భీమేశ్వరములు ఎల్లలుగా గల త్రిలింగ దేశమునందు తెలుగు భాష పుట్టి పరిఢవిల్లినదని ప్రతీతి. తెనుంగు, తెనుగు మరియు తెలుంగు, తెలుగునకు గల ఇతర నామములు.

సంస్కృత, ప్రాకృతాలతో పరిపుష్టమైన ద్రావిడ భాష తెలుగు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉర్దూ ప్రభావం కూడా తెలుగుపై కనిపిస్తుంది. అజంతములైన (అచ్చులు చివరగా గల) పదములతో నిండి ఉండడం చేత కడు శ్రావ్యముగాను, మృదు మధురముగాను ఉండి, సంగీత భావ ప్రకటనకు అనుకూలముగా  ఉండుట చేత తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా పరిగణించారు. సాంప్రదాయ సాహిత్యానికి పెద్ద పీట వేసే కర్నాటక సంగీతానికి ఆద్యులైన త్రిమూర్తులలో త్యాగరాజు, శ్యామ శాస్త్రి తమ రచనలను తెలుగు భాషలోనే గావించారు.

క్రీ.శ. రెండవ శతాబ్ది కాలానికి చెందిన బ్రాహ్మీ లిపి లోని తెలుగు శాసనాలు, క్రీ.శ. పదునొకండవ శతాబ్దికి చెందిన అద్ది కవి నన్నయ విరచిత మహా భారత కావ్యము తెలుగు భాష యొక్క ప్రాచీనతను, ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి. అచ్చుల హల్లుల ఉచ్చారణ, తత్సమములు, తద్భవముల ఉపయోగమునకు సంబంధించి సంస్కృత భాషలోని అనేక ప్రత్యేకతలను తెలుగు భాష తనలో పొదుగుకొని, భారతీయ భాషలన్నిటిలోను ప్రాచీనతను, ఆధునికతను ప్రతిబింబించే అరుదైన భాషగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకొన్నది.

తెలుగులో ప్రామాణికమైన గ్రాంథికభాషను “అచ్చ తెనుగు” లేదా “శుద్ధ తెలుగు” అంటారు. తెలుగు భాషకు అనేక ప్రాదేశిక, మాండలీక, జానపద స్వరూపములు కూడా ఉన్నాయి. పదహారు అచ్చులు, నలుబది ఒక్క హల్లులు మరియు మూడు సంజ్ఞా సూచికలతో గల తెలుగు వర్ణమాలను “ఓనమాలు” అంటారు. తెలుగు వర్ణమాల శాస్త్రీయ దృక్పథంతో అతి ఎక్కువ శబ్దములను ఉచ్చరించే విధంగా నిర్మింప బడినది. తెలుగు వాక్య నిర్మాణము కర్త-కర్మ-క్రియ ప్రధానముగా గలది.

ఆది కవి నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగ్గడలు సంస్కృత మహా భారతమును తెనిగీకరించి కవి త్రయమని పేరు పొందిరి. కథలను చందో బద్ధ పద్యములుగా చెప్పు శృంగార నైషధము వంటి ప్రబంధములు శ్రీనాథుని కాలమునందు బహుళ ప్రాచుర్యమును పొందినవి. రామకృష్ణులు తెలుగు వారి ఆరాధ్య దైవములు. గోన బుద్ధా రెడ్డి మొదలుగా గల అనేక తెలుగు కవులు, కవయిత్రులు శ్రీమద్రామాయణమును, బమ్మెర పోతన వంటి కవులు శ్రీమద్భాగవతామును తెలుగులోకి అనువదించారు. పదకవితామహుడు తాళ్ళపాక అన్నమయ్య సంస్కృతాంధ్ర భాషలలో తన ఆరాధ్యమైన శ్రీ వేంకటేశ్వరునిపై ముప్పది రెండు వేల సంకీర్తనలు రచించాడు. తదుపరి రామదాసు, క్షేత్రయ్య వంటి ఇతర వాగ్గేయ కారులు, ఇతర శతక కర్తలు తమ తమ పద్యాల ద్వారా భక్తి శృంగారాలను, సామాజిక చైతన్యాన్ని ప్రతిపాదించారు.

శ్రీ కృష్ణ దేవరాయల కాలం లోని పదహారు-పడునేడు శతాబ్దములు తెలుగు సారస్వతమునకు స్వర్ణ యుగమని  చెబుతారు. “దేశ భాషలందు తెలుగు లెస్స”గా కీర్తించబడింది. అష్ట దిగ్గజముల వంటి కవి పండిత ప్రకాండులచే భువన విజయం శోభిల్లింది. ఆముక్తమాల్యద, మను చరిత్ర వంటి మహా కావ్యములు ఉద్భవించాయి. ఆ తరువాత తంజావూరు, మదురై సంస్థానాదీశులు తెలుగును సమాదరించారు.

మొగల్రాజులు దక్కనుపై దండెత్తి ఆక్రమించుకొన్న తరువాత కొన్ని దశాబ్దములు తెలుగు భాష స్తబ్దతను సంతరించుకొన్నప్పటికినీ, తదుపరి సి.పి.బ్రౌన్, పరవస్తు చిన్నయసూరి వంటి మహనీయుల ద్వారా పునరుద్ధరింప బడింది. చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణము, నీతిచంద్రిక మున్నగునవి బహుళ ప్రచారమునందినవి.

రాజశేఖర చరిత్రము వంటి రచనల ద్వారా సామాజిక చైతన్యానికి పాటుబడిన కందుకూరి వీరేశలింగం గారిని ఆధునిక తెలుగు భాషా పితామహునిగా అభివర్ణిస్తారు. తదుపరి గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీరంగం శ్రీనివాస రావు, మున్నగువారెందారో తెలుగు కవిటా పతాకను ప్రపంచ సాహిత్య పటముపై ఎగురవేశారు.

ముందుగా విశ్వనాథ సత్యనారాయణ. తదుపరి సి. నారాయణ రెడ్డి తమ తమ తెలుగు రచనలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. పాలగుమ్మి వారి గాలి వాన, ఉన్నవ వారి మాలపల్లె. గుంటూరు శేషేంద్ర శర్మ గారి నా దేశం, నా ఇల్లు వంటి రచనలు అంతర్జాతీయ సాహిత్య మన్ననలు పొందాయి.  అనేక తెలుగు రచనలు ప్రపంచ భాషలలోకి అనువడింప బడ్డాయి.

భాష, అభ్యాసము, వ్యాకరణము, చందస్సు, పంచతంత్ర నీతి కథలు గల గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాల శిక్ష, పెద్దలకు పిల్లలకు తెలుగు భాషను నేర్పు సాధనముగా ప్రచారమందినది.  ఆధునిక దేశ, కాల మాన పరిస్థితులకనుగుణముగా పిల్లలకు తెలుగు నేర్పు  విధానము, విషయములకు ఆధునికతను జోడిస్తూ అంతర్జాతీయ తెలుగు బడి, అంతర్జాతీయ బాల శిక్షలు ఉద్భవించాయి.