శ్రీ గురుభ్యోన్నమ:, అంతర్జాతీయ తెలుగు బడిని ఆదరిస్తున్న, ప్రియాతి ప్రియమైన విద్యార్థినీ విద్యార్థులకు, వారిని ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులకు, స్వచ్చంద సైనికులవంటి ఉపాధ్యాయులకు, హితులకు, సన్నిహితులకు, స్నేహితులకు, భాషాభిమానులకు, శారదా బంధువులకు అందరికీ వందనములు.
దాదాపు రెండు దశాబ్దాల క్రితం, అమెరికాకి వచ్చిన క్రొత్తలో, ఇక్కడి మన పిల్లలకు తెలుగు ఎందుకు నేర్పాలి? అనే కన్నా, ఎలా నేర్పాలి? అనే ప్రశ్న మనసులో ఉదయించింది. ఆ తరువాత చాలా ఊళ్ళలో, అనేక సంవత్సరాలుగా, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, కేవలం తెలుగు భాష మీద అభిమానంతో, పిల్లలకి చదువు, సంస్కృతి, సంప్రదాయం నేర్పుదామన్న మహదాశయంతో, నిస్వార్థంగా “తెలుగు బడులు” నడుపుతున్న ఎందరో ఉపాధ్యాయులను, వారి నిబద్ధతను, సమర్థతను, చూశాక ఎంతో ఆనందం కలిగింది.
అయితే, ఒక సంవత్సరం చెప్పిన పాఠ్య ప్రణాళికకి, అది నేర్చుకొన్న పిల్లలకి, ఆ పై సంవత్సరంలో చెప్పబోయే దానికీ, పెద్ద తేడా లేకపోవడం, పిల్లలచేత బలవంతంగా అక్షరాలను దిద్దించడం, అర్థాలు, అన్వయాలు చెప్పకుండా పద్యాలను భట్టీయం వేయించడం వంటి పద్ధతులతో ఇబ్బంది పెట్టడం, తెలుగు భాషను నేర్పడంలో, ప్రాచీన పద్ధతులనే అనుసరిస్తూ, విద్యార్థులకి సంబంధం లేని, అర్థం కాని, విషయాలను, వారి చేత బలవంతంగా చదివించడం చూశాక చాలా బాధ కలిగేది.
ఆంధ్రదేశంలో మనకు “తెలుగు”, పత్రికలలోనూ, టి.వి. లలోను, సినిమాలలోను, ఇంటా – బయటా, అంతటా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటుంది. ప్రవాసంలో ఇక్కడి పిల్లలకు, తెలుగు అక్షరాల రూపంలో కానీ, అందుబాటులోనున్న పుస్తకాల రూపంలో కానీ, మరో రూపంలో కానీ కనిపించదు. అమ్మా-నాన్న, బంధువులు, స్నేహితుల ఇండ్లలో మాట్లాడితే తప్ప, బయట “తెలుగు” అరుదుగా వినిపిస్తుంది.
ఇక్కడి పిల్లలకు మనకు మన చిన్నతనంలో ఎంతో ఇష్టమైన రాజకుమారులు-శిథిలాలయాల చందమామ కథల కన్నా, వారు నిత్యం చూసి, అనుభవించే విషయాలు చెబితే, అవీ, వాటితో బాటుగా మనకెంతో ఇష్టమైన తెలుగు భాష, మనం చెబుదామనుకొన్న మంచి విషయాలు, నీతి సూక్తులు, త్వరగా వారి మనసులకి హత్తుకొంటాయని అనిపించింది. వారికి ఇంటా-బయటా, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, తెలుగు, సిగ్గు పడకుండా, తొట్రుపాటు లేకుండా, స్వచ్చమైన ఉచ్చారణతో మాటలాడే వాతావరణాన్ని మనం కలిపించి, మన బాధ్యతలను విస్మరించకుండా నిర్వర్తిస్తూ, వారి ప్రయత్నాలని మనస్ఫూర్తిగా అభినందిస్తే, ఫలితాలు మరింత బాగుంటాయనిపించింది.
వారికి “అ-ఆ”లు నేర్పేటప్పుడు, “అమ్మ-ఆవు”లతో బాటుగా, “అట్లాంటా-ఆస్టిన్” అని చెబితే త్వరగా వారి మనసుకి ఎక్కుతందనిపించింది. అర్థం కాని అక్షరాల ఆకృతుల కన్నా, వారికర్థమైన భాషలో సులభంగా వ్రాసి, గుర్తు పెట్టుకొనే విధంగా చెబితే, వారు తెలుగు భాషతో పరిచయాన్ని అలవోకగా పెంచుకొంటూ, తెలుగు వారిలా, తెలుగులో ఆలోచిస్తూ, వారి ఆలోచనలను, అభిప్రాయాలను, పదిమందితో తెలుగులో సులభంగా పంచుకొనే ప్రయత్నం చేస్తారనిపించింది.
మనం అవునన్నా, కాదన్నా అక్కడ ఆంధ్రాలోను, ఇక్కడ అమెరికా లోను తెలుగు వాడకం, అభిమానం రాను రాను కనుమరుగయిపోతున్నాయి. అటువంటప్పుడు మన మాతృభాషను, మన పిల్లలకు రెండవ భాషగానో, మూడవ భాష గానో నేర్పవలసిన అవసరం వస్తోంది. అయితే, ఒక భాషను నేర్చుకోవడానికి మరొక భాషను ద్వేషించనక్కరలేదు. ఇక్కడ పిల్లలు, స్పానిష్, ఫ్రెంచ్ మొదలైన భాషలు అతి పిన్న వయసునుండే, ఇంగ్లీషు ద్వారా నేర్చుకొంటారు. మరి మన తెలుగును మాత్రం, ప్రస్తుతం వారి చుట్టూ ఉన్న ఇంగ్లీషు వాతావరణం ద్వారా, వారికి తెలిసిన ఇంగ్లీషు భాష ద్వారా ఎందుకు నేర్పించకూడదనిపించింది? అప్పటికే, ఈ కంప్యూటర్లలో తెలుగు పత్రికలు అవీ ప్రచురించడానికి ఇంగ్లీషు కీబోర్డుతో, ట్రాన్స్ లిటరేషన్ తో పరిచయం కలిగి ఉండడం, ఈ ఆలోచనకు మరింత ఆజ్యం పోసింది.
మనం చెప్పే విధానంలోనే కాకుండా, చెప్పడానికి మనం వాడే ఉపకరణాలలోను, పాఠ్య ప్రణాళికలలోను, అందరితో కలిసి పుస్తకములు తయారు చేయడం లోను, అందరి అభిప్రాయాలను పరిగణన లోనికి తీసుకొని, సామాజిక స్పృహ, భాషాభిమానం కల పదిమందితో కలిసి పని చేస్తే ఫలితాలు మరింత బాగుంటాయనిపించింది.
మనం, మన ఆఫిసులలో మాత్రమే వాడే ప్రాజెక్టు మేనేజిమెంటు, ప్రొఫెషనలిజం, స్ట్రక్చర్డ్ థాట్, ఆర్గనైజ్డ్ డెవెలప్ మెంట్, లాజికల్ అప్ప్రోచ్, టీమ్ వర్క్, ప్రజంటేషన్ స్కిల్స్ మొదలైనవి ఇటువంటి విషయాలలో కూడా చొప్పించాలనిపించింది. అంతే కాక, మన పిల్లలకు భాషను నేర్పే పధ్ధతిలో కూడా, “వారికి నచ్చినది వారు నేర్చుకొనే – మాంటిస్సోరి”, “ప్రతి ఒక్కరిపై వ్యక్తిగత శ్రద్ధ కనబరుస్తూ, దగ్గరుండి క్లాసు వర్క్ మరియు హోం వర్క్ చేయించే – కుమాన్” వంటి పధ్ధతులలోని మంచి అంశాలను పరిశీలించి, అనుసరిస్తే బాగుంటుందనిపించింది.
ఇదే సమయంలో, ఊరూరా, వాడ-వాడలా వెలుస్తున్న మరిన్ని బడులు, పీఠాలు, వాటి బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళికలు, అవి అనుభవించిన విద్యార్థినీ విద్యార్థుల, ఉపాధ్యాయుల ఓర్పు-నేర్పులు, కష్ట-నష్టాలు చూసి, “ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో” నిర్ణయించుకోవడం జరిగింది. ఇన్ని ఆలోచనలకు, ఇందరి పరిశ్రమకు పర్యవసానమే ఈ “అంతర్జాతీయ తెలుగు బడి” ఆవిష్కరణ.
ఇప్పటి వరకూ, గత ఆరేడు సంవత్సరాలుగా ఆస్టిన్, అట్లాంటా, చికాగో, డాలస్ వంటి నగరాలలో ఈ పద్ధతిలో, దాదాపుగా ఇదే పాఠ్య ప్రణాళికననుసరిస్తూ, కొన్ని పదుల మంది ఉపాధ్యాయుల ద్వారా, కొన్ని వందల మంది విద్యార్థులు తెలుగు భాషను నేర్చుకొన్నారు, నేర్చుకొంటున్నారు. చక్కటి ఉచ్చారణతో, భావ ప్రకటనతో, అర్థవంతంగా పద్యాలను నేర్చుకొని, పోటీలలో పాల్గొని, ఆలపించి విజేతలవుతున్నారు. మన సంస్కృతిని, మంచి విషయాలను నేర్చుకొని మరిందరికి చెబుతున్నారు. అమ్మా-నాన్నలతో, బంధువులతో తెలుగులో మాటలాడుతున్నారు. వారి వారి స్నేహితులతో కలిసినప్పుడు తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రవాస భాషా యజ్ఞంలో, ఈ సమిష్టి సామాజిక విజయంలో, ఎంతో పట్టుదలతో నేర్చుకొనే ఆయా విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాలతో బాటు, “మనిద్దరి పిల్లలతో బాటుగా, మరిందరికి” చెబుదామని తలపోసి, ఎంతో అమూల్యమైన సమయాన్నీ, శక్తి యుక్తులను ధారపోస్తున్న, వారి వారి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రమేయం, శ్రద్ధ ఇమిడి ఉన్నాయి.
ప్రవాసంలోనైనా, స్వదేశంలోనైనా,
మన పిల్లలు..
మనం మాట్లాడే భాషను, మాట్లాడడానికి ఇష్ట పడతారు,
మన నైతిక విలువలను, ప్రమాణాలను, వారి ఆచరణలో, ఆలోచనలలో ప్రతిబింబింప జేస్తారు,
మన ఆదర్శాలను, ఆశయాలను, వారి లక్ష్యాలుగా స్వీకరిస్తారు.
మనం గౌరవించే మనుష్యులను, పద్ధతులను, ఆదరిస్తారు,
మనం ఆనందించే సంగీత, సాహిత్య, సాంప్రదాయాలను, నేర్చుకొంటారు,
మనం ఆరాధించి, ఆచరించే సంస్కృతినే, అనుకరిస్తారు, అనుసరిస్తారు!
మన సంస్కృతినీ, సాహిత్యాన్నీ, మన మాతృ భాషా మూలాలను పదికాలాలు పరిరక్షించుకొని, అభివృద్ధి చేసుకోవాలంటే, ముందు మనం తెలుసుకొని, మనసు ఉంచి, మన పిల్లల మనస్సులకు హత్తుకొనేలా నేర్పడానికి మించి, మంచి మార్గమున్నదా?
ఈ ప్రయత్నాన్ని ఇలాగే ఆదరించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మీరందించే విలువైన సలహాలు, సూచనలకై ఎదురు చూస్తుంటాము…